
విజన్ వార్త, చెన్నూర్, మార్చ్ 29:
డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం యుద్ధాలపై మౌనం వహించడం సరికాదని రైతు సంఘం,సిఐటియు నాయకులు విమర్శించారు. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధాలు తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బోడెంకి చందు మాట్లాడుతూ, అమెరికా , ఇజ్రాయిల్ గత కొన్ని సంవత్సరాలుగా ఇతర దేశాలపై యుద్ధాలు చేస్తూ అమాయక ప్రజలు, పసిపిల్లల ప్రాణాలను బలితీసుకుంటున్నాయని అన్నారు. గత నెల రోజులుగా ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం కారణంగా మరింత ప్రాణనష్టం జరుగుతోందని పేర్కొన్నారు.
దేశ ప్రజలు ఇంధన ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ప్రధాని మోడీ ఇప్పటివరకు యుద్ధాలు ఆపాలని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. యుద్ధాల ప్రభావంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ , నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వ్యాపారాలు దెబ్బతిన్నాయని, లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు.
ప్రపంచంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయని, తక్షణమే యుద్ధాలు ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలని, ప్రపంచ శాంతిని నెలకొల్పాలని రైతు సంఘం , సిఐటియు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రంజిత్, నాయకులు కావిరి రవి, వెంకటస్వామి, మల్లయ్య, సంతోష్, దామోదర్, రైతు సంఘం నాయకులు మనోహర్, రమేష్, శంకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.